25, మే 2022, బుధవారం

అమ్మ సృష్టికర్త. అమ్మ తన కడుపును గర్భాలయం చేసి మరణ సదృశమైన వేదనను పొంది బిడ్డకు జన్మనిస్తుంది,

*బిడ్డ పుట్టిన రోజే అమ్మకు కూడా పుట్టినర

అమ్మ సృష్టికర్త. అమ్మ తన కడుపును గర్భాలయం చేసి మరణ సదృశమైన వేదనను పొంది బిడ్డకు జన్మనిస్తుంది, అందుకే ప్రతి బిడ్డ పుట్టినరోజు అమ్మకు కూడా పుట్టిన రోజే. బిడ్డ అమ్మ శరీరంలో అంతర్భాగం. ఈవేళ మనకున్న శరీరం అమ్మ కడుపులో పుట్టి పెరిగిందే కదా! పుట్టినది మొదలు మల మూత్రాదులను శుభ్రం చేసి, పెంచి పెద్దచేసి, ఆఖరి ఊపిరిలో కూడా పిల్లలు కష్టపడకూడదని, తాను ఎన్ని ఇబ్బందులు పడుతున్నా పైకి చెప్పకుండా పిల్లలు వృద్ధిలోకి రావాలని కోరుకుంటూ తన ఆయుర్దాయం కూడా పిల్లలకు ఇవ్వమని ప్రార్థించే అమ్మ లాంటి వ్యక్తి ఈ లోకంలో మరొకరు ఉండరు. అమ్మే ఈ శరీరాన్ని ఇవ్వకపోతే మనకు ఈ శరీరం ఎక్కడిది ?  


మన సుఖ సంతోషాలకు మన కీర్తిప్రతిష్ఠలకు మూలమయిన ఈ శరీరం అమ్మ ప్రసాదించిందే. అమ్మను మించిన దైవం ఎక్కడుంది? అందుకే వేదం మొదటి నమస్కారం అమ్మకు చేయించింది– మాతృదేవోభవ–అని. మిగిలిన అందరికీ పుట్టిన రోజు ఒక్కటే కానీ అమ్మకు మాత్రం తాను స్వయంగా జన్మించిన రోజున ఒక పుట్టిన రోజుతోపాటూ, ఎంతమంది బిడ్డల్ని కంటుందో ఆమెకు అన్ని పుట్టినరోజులుంటాయి. అంటే అమ్మకు ఇద్దరు బిడ్డలుంటే మూడు పుట్టినరోజులుంటాయి. స్త్రీగా తన పుట్టినరోజును భర్త వేడుకగా చేస్తే, మిగిలిన పుట్టిన రోజులను బిడ్డలు తమకు జన్మనిచ్చినందుకు కృతజ్ఞతగా మొదట ఆమెకు కొత్త బట్టలు పెట్టి తరువాత తాము వేసుకుని వేడుక చేసుకోవాలి.


స్త్రీగా కూడా ఆమె పుట్టిల్లు, అత్తవారిల్లు... రెండింటి క్షేమాన్నీ ఆకాంక్షిస్తుంది. తల్లిగా రెండు వంశాలను తరింప చేస్తుంది. ధర్మపత్నిగా పురుషుడికి యజ్ఞయాగాది క్రతువుల నిర్వహణకు అర్హుడిని చేస్తుంది. భగవంతుడు ఎక్కడో ఉండడు, అమ్మరూపంలోనే మనకు అందుబాటులో ఉంటాడు. అందుకే బద్దెనగారు ‘‘నీరే ప్రాణాధారము, నోరే రసభరితమైన నుడువులకెల్లన్‌/నారియె నరులకు రత్నము/ చీరయె శృంగారమండ్రు సిద్ధము సుమతీ!’’ అన్నారు. మనుషులలో రత్నం అంత గొప్పది స్త్రీ అంటున్నారు.


అలాగే ‘చీరయె శృంగారమండ్రు...’ అన్నారు. చీర అంటే స్త్రీలు ధరించేదని కాదు. రాముడు నార చీరెలు కట్టుకున్నాడు అంటారు. చీర– అంటే వస్త్రం. శృంగారం అంటే పరమ పవిత్రమయిన అలంకరణ, శుద్ధమయినది... అని! కట్టుకున్న బట్టను బట్టి మనిషి జీవన విధానం తెలుస్తుంటుంది. వేల ఖరీదు చేసే వస్త్రాలే కట్టుకోవాలనే నియమం ఏదీ ఉండదు. ఏది కట్టుకున్నా బట్ట పరిశుభ్రంగా, ప్రకాశవంతంగా ఉండాలి. నిజంగా కష్టంలో ఉండి నిస్సహాయ పరిస్థితుల్లో తప్ప మనిషి ఎప్పుడూ పరిశుభ్రమైన వస్త్రాలనే ధరించాలి. పిల్లలు మరో విషయం కూడా గుర్తుపెట్టుకోవాలి.


ఎవరి బట్టలు వారు శుభ్రం చేసుకోవడం చిన్నప్పటినుండే అలవాటు చేసుకోవాలి. దీనివల్ల మీకు పరిశుభ్రత మీద ఆసక్తి పెరగడమే కాక, అమ్మ కష్టాన్ని కూడా తగ్గించిన వారవుతారు. మన సంప్రదాయం ప్రకారం బయట ఎక్కడికి వెళ్లి వచ్చినా ముందుగా కాళ్ళు చేతులు శుభ్రం చేసుకోవాలి, బయట తిరిగొచ్చిన బట్టలు మార్చుకోవాలి. విడిచిన బట్టలు, తడి బట్టలు ఇంట్లో ఎక్కడంటే అక్కడ కుప్పలుగా వేయకుండా వాటి స్థానాల్లో వాటిని ఆరేయడమో, తగిలించడమో చేయాలి. అది మన శరీరానికి, పరిసరాలకే కాదు, మన ప్రవర్తనకు, మన శీలానికి, మన వ్యక్తిత్వానికి అలంకారం. అది మనకు గౌరవాన్ని తెచ్చిపెడుతుంది. బద్దెన గారు చెప్పినవి చిన్నచిన్న మాటలే అయినా మన జీవితాలను చక్కటి మార్గంలో పెట్టే సూత్రాలు.

 బ్రహ్మశ్రీ చాగంటి కోటేశ్వర రావు గారు

శాస్త్రమునందు హనుమకు వివాహం అయింది. ఆయనను సువర్చలా సహిత హనుమ అని పిలుస్తారు. సువర్చలా సహిత హనుమకు కళ్యాణం చేయడం శాస్త్రంలో అంగీకరించారు. ఎందుకంటే గృహస్థాశ్రమంలోకి వెళ్ళకుంటే పెద్దలైనటువంటివారు తరించరు. శాస్త్రంలో హనుమకు ప్రవర ఉన్నది. తండ్రిగారు కేసరి, తాతగారి పేరు, ముత్తాతగారిపేరు కళ్యాణంలో చెప్తారు. హేమగర్భుడు అని వారి ముత్తాతగారి పేరు. ఒకతండ్రి కడుపున పుట్టిన పిల్లవాడు వివాహం చేసుకోకుండా ఉండిపోతే తల్లిదండ్రులు దేహములు చాలించిన తరువాత వారి శరీరాలను చెట్లకి త్రిప్పి కట్టేస్తారు. ఎందుకంటే నువ్వు వివాహం చేసుకోనటువంటి సంసార భ్రష్టుడిని కన్నావు కనుక అని. అందుకని పిల్లలు వివాహం చేసుకోకుండా ఉండకూడదు. అలా చేయడం తల్లిదండ్రులయొక్క ప్రధానమైన బాధ్యత. నవ వ్యాకరణపండితులు, మహా బుద్ధిమంతుడైన హనుమ వివాహం చేసుకోకుండా అటు సన్యాసం తీసుకోకుండా ఉండరు కదా! మీకు అందుకే భారతీయ సంప్రదాయంలో ఋషులందరూ వివాహం చేసుకొని ఉంటారు. అలాగే హనుమ కూడా శాస్త్రమునకు సంబంధించినంతవరకు గృహస్థాశ్రమంలో ఉంటారు. కాపురం చేసినట్లు, పిల్లల్ని కన్నట్లు లేదు. ఎందుకంటే ఆయన బ్రహ్మజ్ఞాని. అందుచేత సువర్చలను వివాహం చేసుకున్నారు. ఇద్దరూ యోగమును అనుసంధానం చేశారు.

 హనుమజ్జయంతి జీవితంలో ఒక్కమారు చేసినట్లైతే వంశమంతా తరించిపోతుందన్నారు. జయంతి చేసేరోజు గృహస్థు భోజనం చేయకుండా ఉండకూడదు. ఒకపూట భోజనం చేసి తీరాలి. యతి పురుషులు ఈరోజు భోజనం చేయకూడదు. పూర్ణ ఉపవాసం చేయాలి. హనుమజ్జయంతి చేసే గృహస్థు యొక్క భార్య జీవితంలో ఒక్కహనుమజ్జయంతినాడైనా సరే గురువింద పూసలతో ఉపాసన అని ఒకటున్నది.భర్త పూజ అంతా అయిన పిదప భార్య స్వచ్ఛమైన ఆవునేతిని తీసుకువచ్చి అప్పాలను సాయంకాలం వరకు వేయించాలి. అనగా సాయంకాలం వరకు ఎన్ని చేయగలిగితే అన్ని అని..మాడ్చమని కాదు. ఒకేగోత్రంతో ఉన్న కుటుంబాలలో ఉన్న తోడికోడళ్ళు అందరూ కలిసి హనుమజ్జయంతి చేస్తారు. హనుమ అంత త్వరగా ప్రీతిచెందే మహాపురుషుడు మరొకరుండరు. ఈ అప్పాలను సాయంకాలం సీతారామచంద్రులకు, హనుమకు, పరివారమునకు మంత్రంతో స్వాగతం పలికి నివేదన చేసి సీతారామచంద్రులయందు అపారభక్తికలిగిన వాడు, హనుమను ఉపాసన చేస్తున్నటువంటి వ్యక్తి హనుమజ్జయంతినాడు మీకు తారసపడితే వారి ఇంటికి వెళ్ళేటటువంటి చనువు మీకున్నా వారు మీఇంటికి వచ్చేటటువంటి అనుగ్రహం వారికున్నా ఒక విషయం చేత మీ జన్మ పండుతుంది అన్నారు. అటువంటి పరమభక్తుడైన వ్యక్తితో పరిచయం ఉంటే సూర్యాస్తమయం అయ్యే లోపల ఐదు ఆకులు కానీ, పండ్లు కానీ, అప్పములు కానీ తీసుకెళ్ళి వారికిస్తే వారు ఆ రోజు తీసుకొని ఒక్కపండుముక్క ఆయన నోటిలో వేసుకున్నా మీజన్మ తరించిపోయినట్లే. హనుమజ్జయంతికి అయిదు అంకెతో అంత అనుబంధం. ఒకేజాతికి చెందిన అయిదు ఫలాలను ఇవాళ్టి రోజున సీతారామచంద్ర ప్రభువుయొక్క పాదములయందు అపారమైన భక్తి కలిగినటువంటి వారు, హనుమను సేవించేటటువంటి వాడు, అటువంటి వారి ఇళ్ళకు వెళ్ళగలిగిన చనువు మీకుంటే (నిత్యము, 

నైమిత్తికము అని రెండు రకాల తిథులుంటాయి. సంధ్యావందనాదులు రోజూ చేస్తూ ఉంటారు.నైమిక్తికము అంటే ప్రత్యేక తిథులు వీటియందు కొన్ని ప్రత్యేకమైన పనులుంటాయి. అవి చేస్తే జన్మ తరిస్తుంది. అవి సులభ మార్గములు.)వారు పుచ్చుకుంటే మీజన్మ తరించిపోయినట్లే. ఎందుకంటే అది సాక్షాత్ హనుమయొక్క స్వీకారమే. ఇలా చెప్పింది పరాశర సంహిత. అయిదంకె మీద పండు, అయిదంకె మీద ఆకు, అయిదంకె మీద నేతి అప్పములు, ఆలయంలో అర్చన చేసేవాళ్ళు, సీతారామచంద్రులను నమ్ముకున్నభక్తులకు ఇవ్వండి. అలా ఇస్తే మీరు తరిస్తారు. హనుమ ఆవాహన ఎక్కడ తొందరగా జరుగుతుందంటే అరటి చెట్లు బాగా కట్టి అరటి గెలలు బాగా వంగి ఉండేటట్లుగా అలంకారం చేసి అప్పుడు హనుమజ్జయంతి చేయాలి. హనుమ తొందరగా ప్రసన్నులైపోవాలంటే అరటితోటలోకి వెళ్ళి హనుమయంత్రం కానీ హనుమ బొమ్మ కానీ హనుమ అని వ్రాసి కానీ అక్కడ పెట్టి మీరు కానీ ఉపాసన చేశారా ప్రత్యక్షమైనటువంటి స్వరూపంతో స్వామి వచ్చి తీసుకొని తీరుతారు అని అభయమిచ్చింది పరాశర సంహిత. అన్నింటికన్నా ఆయన తొందరగా ప్రీతి చెందేది అరటిపండు వల్ల. కదళి పూజ అని ప్రత్యేకమైన పూజ ఆయనకి. అలా చేస్తే ఏదో ఒక రూపంతో మీకు కంటికి కనపడే రూపంతో రాకపోవచ్చు. కానీ ఏదో ఒక రూపంతో ఆయన వచ్చి తీసుకొని వెళ్ళి తీరుతారు. తొందరగా ప్రసన్నుడై వస్తే వానరరూపంలో వస్తారు. తప్పకుండా అరటిపండ్లు నివేదన చేయాలి. పరమ ప్రసన్నుడౌతాడు స్వామి. ఈ రోజు తప్పకుండా దేవాలయంలో హనుమ దర్శనం చేసుకోవాలి. హనుమ గురించి తప్పకుండా నాలుగు మాటలు వినాలి. ఎవరికి హనుమ అనుగ్రహం కలగాలని హనుమ భావిస్తున్నారో వారు మాత్రమే వింటారు

5, మే 2022, గురువారం

Panchangam 6th Friday May 2022🌺శుక్రవారం 6th మే 2022🌺


 

 రేపటి రోజు జగద్గురువులు ఆదిశంకర భగవత్పాదుల యొక్క ఆవిర్భావ దినం. ఇది సనాతన ధర్మం అంతటికీ పండుగరోజు. 


 ఎంతవరకూ దేహమే నేను అనే భావం ఉంటుందో అంతవరకూ వైదికమైన సత్కర్మలు ఆచరించాలి. 

షణ్మతాలూ ఈ మూడు సిద్ధాంతాలతో ఉంటాయి. 

ద్వైత, విశిష్టాద్వైత, అద్వైతములు X షణ్మతములు = హిందూ ధర్మం యొక్క స్వరూపం.


అద్వైతం అనే ఒకానొక జ్ఞానం భూమికగా కలిగి ఉన్నట్లయితే పరస్పర వైరములు లేకుండా ఉంటాయి. అందుకే ఆదిశంకర భగవత్పాదుల వారు అద్వైతం ప్రతిష్ఠాపన చేస్తూ “ఉన్నది ఒక్కటే పరమాత్మ తత్త్వము. జీవుడికి కూడా దేహాత్మ భ్రాంతి ఉన్నంతవరకే భేదం కానీ అది తొలగించి చూస్తే సత్య దృష్టితో అద్వైతమే” అని చెప్పారు. 

వ్యవహారంలో అద్వైతం కుదరదు, ద్వైతమే ఉంటుంది. పరమార్థంలోనే అద్వైతం. పారమార్థిక దృష్టి కలిగి వ్యవహార జీవనంలో ఉన్నప్పుడు అద్వైత స్పృహలోనే ద్వైత జగత్తులో ఉంటాం. దీనివల్ల సమాజంలో ఒక శాంతి ఏర్పడుతుంది. 


సిద్ధాంతాలు అర్థం అయినా అవకపోయినా శంకర సిద్ధాంతంలో ఉన్న వారికి ఎవరి ఇష్టదేవతలు వారికి ఉన్నా ఇతర దేవతలను ద్వేషించరు. అది ఒక్కటి చాలు ప్రపంచాన్ని ఆరోగ్యంగా ఉంచే పద్ధతి. 


వైష్ణవంలోను, శైవంలోనూ మహాత్ములు, ఉద్దండులూ ఉద్భవించారు. గొప్పగొప్ప భక్తులు ఉన్నారు. వారు ముక్తజీవులే. కానీ వారి అనుయాయులం అని చెప్పుకొనే వారిలో ప్రస్తుతం ఉన్నవారు శివద్వేషం వైష్ణవంగాను, విష్ణుద్వేషం శైవంగాను, చలామణి అవుతోంది. వీరికి ఇతర మతముల పట్ల విపరీతమైన ద్వేషం. 


చాలామందికి శంకరాచార్య అంటే శైవుడని, రామానుజాచార్య అంటే వైష్ణవుడనీ, ఒకానొక భ్రమ బాగా ఉంది. రామానుజులు కేవల వైష్ణవ మతస్థులు అనడంలో ఏమీ సందేహం లేదు. ఆయన ఇతర దేవతలను ప్రశంసించరు. మీదు మిక్కిలి వారి అనుయాయులు శివాదులను ద్వేషించడానికి కూడా సిద్ధంగా ఉంటారు. ఇతర దేవతలు అంటే వారికి గిట్టదు. అవమానంగానే చూస్తారు. తపనిసరియై నోరుమూసుకున్నప్పటికీ మనస్సు నిండా కించపరచే భావమే వారికి ఉంటుంది. 


శంకరాచార్య శైవులు కాదు. ఆయన శివాంశ సంభూతులు అని శంకర విజయాలు చెప్పాయే తప్ప ఆయన శైవుడు కాదు. 

వైదిక శైవం గురించి చెప్పాలంటే శ్రీకంఠాచార్యులు, వీరశైవం బసవేశ్వరులు మొదలైన వాళ్ళు ఇచ్చారు.

శైవం వేరు, వైష్ణవం వేరు, శాక్తేయులూ ఉన్నారు. వారందరూ ఆగమ మతాలు. కానీ శంకరాచార్యులు వీటి వేటికీ చెందరు. ఆయనకి శివుడు, విష్ణువు, భేదం లేదు. ఉన్నది ఒక్కటే పరమాత్మ. ఆయన నిర్గుణుడు, నిరాకారుడు. కానీ భక్తులు ఉపాసనా సౌలభ్యం కోసం ఆయన అనేక రూపాలు స్వీకరిస్తాడు. విష్ణువు, శివుడు ఒకే పరమాత్మ నామములే. ఆ పరమాత్మ ప్రతి జీవుడిలో అంతర్యామియే. తత్త్వతః తెలుసుకోగలిగితే జీవుడికీ పరమాత్మకీ భేదం లేదు. ఇది శంకర సిద్ధాంతం.

శంకరులు ఎప్పుడూ శైవం కాదు, ఇది ముందు తెలుసుకోవాలి. 

ఈ వైష్ణవం అనుకొనే ఇతర దేవతా ద్వేషం కలిగినటువంటి వారు శంకరులు శైవులు అని ఒక ముద్ర వేస్తున్నారు. శంకరుల ధర్మంలో శైవం, వైష్ణవం అన్నీ కలిసి ఉంటాయి. షణ్మత ప్రతిష్ఠాపనాచార్య అనే పేరు కూడా ఉన్నది. 


ప్రస్తుతం సనాతనధర్మం కలిసికట్టుగా ఉండాలంటే ఎవరి సంప్రదాయం వారు పాటించాలి. ఇతర సంప్రదాయాలను గౌరవించాలి. ఇది సత్సంప్రదాయం. చాలా అవసరం. 


వైష్ణవులు వైష్ణవంలో ఉన్న వారికి వైష్ణవ ధర్మాలను బోధించడం చేయాలి. ఇతరులకి విష్ణుభక్తిని బోధించాలి. అలాగే శైవులు కూడా శైవసంప్రదాయంలో ఉన్నవారికి శైవ దీక్షలు ఇప్పించవచ్చు. ఇతరులకు శివభక్తి బోధించవచ్చు. కానీ అందరు దేవతలను ఆరాధించుకొనే సంప్రదాయంలో ఉన్నవారిని బలవంతంగా మార్చి, వారికి శివుడి ఆలయాలకు వెళ్ళవద్దు, శివపూజలు చేయవద్దు, శివుడు అంటే అష్టదిక్పాలకులలో ఒకడు, ఏకాదశ రుద్రులలో ఒకడు అంటూ కించపరచి మాట్లాడడం జరుగుతోంది. ఇది చాలా బాధాకరమైన విషయం. 

ఇతరులు మన దేవతలను అవమానిస్తూ మతమార్పిడులు చేయడం ఎలాంటిదో మన మతంలో ఉపమార్పిడులు కూడా అటువంటివే. 


రాజకీయ ప్రాపకాలు, ప్రభుత్వ అండదండలు దగ్గర పెట్టుకొని ఇలాంటి దాష్టీకాలు చేస్తూ సనాతన ధర్మంలో చీలికలు ఎవరైతే తీసుకువస్తున్నారో వాళ్ళు జగద్గురువులు అనడానికి లేదు. వాళ్ళ శాఖకి వాళ్ళు గురువులు అంతే.


సనాతన ధర్మం వేదంలోనుంచి వచ్చిన ఆరుమతాలనూ చూపిస్తూ ఎవరి దేవతలను వారు ఆరాధించుకోండి, ఇతరులను గౌరవించండి.


హిందూధర్మం మొత్తానికి ఒక గురువును చెప్పుకోవాలంటే ఆ గురువు ఆదిశంకర భగవత్పాదులు మాత్రమే. ఆయన వచ్చిన తరువాతనే అవైదిక మతాల ధాటికి చెదిరిపోయినటువంటి శైవవైష్ణవాదులు తిరిగి ఊపిరి పోసుకున్నాయి. అందుకే ఆయనని “షణ్మతప్రతిష్ఠాపనాచార్య’ అన్నారు. 


సనాతన హిందూ ధర్మానికి సమగ్రమైనటువంటి జగద్గురువులుగా ఆదిశంకరులను గౌరవిస్తూ వారి సంప్రదాయ గురువులను గౌరవించుకోవచ్చు. తప్పులేదు. 

 అన్ని రకాల సంప్రదాయాలు ఆ సంప్రదాయంలోని గురువుల వల్లనే పుష్టి పొందాయి. ఈ సంప్రదాయాలన్నింటినీ గౌరవించడం అనే సంప్రదాయం మాత్రం జగద్గురువులు ఆదిశంకర పరంపరలో ఉంది నేటికి కూడా. శంకర పీఠములన్నింటిలోని వారూ ఇటువంటి సామరస్య ధోరణితో ఉన్నటువంటి వారే. పీఠ పరిపాలిత దేవాలయాలలోనూ హైందవ దేవతలందరూ ఆరాధింపబడుతూ ఉన్నారు. నారాయణ స్మరణ, చంద్రమౌళీశ్వరారాధన, శ్రీచక్రార్చన చేస్తారు. సనాతనధర్మం యొక్క స్వరూపం ఇది. 


ప్రతి సంప్రదాయం వాళ్ళూ హిందూ ధర్మ పరిరక్షణ కోసం వారి సంప్రదాయం వదులుకోకుండా ఇతర సంప్రదాయాలను గౌరవించడం నేర్చుకోవాలి. విష్ణువే గొప్ప శివుడు కాదు అని వాళ్ళ గ్రంథాలను భుజాన మోసుకొని ఎలా తిరుగుతున్నారో, శివుడు తప్ప ఇంకెవరూ గొప్ప కాదు అని చెప్తూ గ్రంథములు మోసుకు తిరగడానికి వాళ్ళూ సిద్ధంగా ఉన్నారు. ఏ నూతిలో మండూకానికి ఆ నూతి లోతు తెలిసినట్లు ఏ సంప్రదాయజ్ఞుడికి ఆ సంప్రదాయపు లోతు తెలుస్తుంది. తమకు తెలియని సంప్రదాయాల గురించి అవహేళనగా, కించపరచి మాట్లాడరాదు. సందర్భం వస్తే అది మా సబ్జెక్ట్ కాదు అని నమస్కారం చేయడం చాలా మంచిది.  


సనాతనధర్మం పరస్పర ద్వేషాలు, చీలికల జోలికి వెళ్ళకుండా సమన్వయ ధోరణిలో వెళ్ళాలి అని ఒక సంకల్పం తీసుకోవాలి. ఇక ద్వైత, విశిష్టాద్వైత, అద్వైతాల గొడవ పండితులు ఎలాగూ వాళ్ళ పని వాళ్ళు చూసుకుంటున్నారు. సామాన్యులకి అవి అవసరం లేదు. ధర్మము, భక్తి – ఈ రెండూ చాలా ప్రధానం. 


మనది మనం పాటిద్దాం, ఇతరులను గౌరవిద్దాం. ఈ సంప్రదాయాన్నిమనకు బోధించిన జగద్గురువులు ఆదిశంకర భగవత్పాదుల పాదపద్మాలకు నమస్కరిద్దాం.

Gg